Site icon NTV Telugu

Manoj Tiwari: ఏకంగా బీజేపీ ఎంపీ ఇంటికే కన్నం.. ఎంత డబ్బు ఎత్తుకెళ్లారో తెలుసా?

Manoj Tiwari

Manoj Tiwari

BJP MP Manoj Tiwari’s Mumbai Home Theft: బీజేపీ నేత, ఢిల్లీ ఈశాన్య లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ముంబై ఇంట్లో జరిగిన చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంధేరీ వెస్ట్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ఉన్న సుందర్‌బన్ అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది. మొత్తం 5.40 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చోరీ చేసిన దొంగ ఎవరో బయట వ్యక్తి కాదు. మనోజ్ తివారీ ఇంట్లో గతంలో పనిచేసిన ఒక ఉద్యోగి అని తేలింది. మనోజ్ తివారీకి గత 20 ఏళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ జోగిందర్ పాండే అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

READ MORE: Nora Fatehi : పాత గాసిప్స్ మళ్ళీ తెరపైకి తెచ్చి నోరా..

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడి పేరు సురేంద్రకుమార్ దీనానాథ్ శర్మ. ఇతడిని సుమారు రెండు సంవత్సరాల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఇంటికి సంబంధించిన డూప్లికేట్ తాళాలు అతని వద్ద ఉండటంతో అదే అవకాశంగా తీసుకుని చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీ ఒక్కరోజులో జరగలేదని పోలీసుల విచారణలో బయటపడింది. జూన్ 2025లోనే బెడ్‌రూమ్‌లోని ఒక అల్మారాలో నుంచి 4.40 లక్షల రూపాయలు మాయమయ్యాయి. అప్పట్లో ఎవరు దొంగతనం చేశారో తెలియలేదు. అనుమానం రావడంతో డిసెంబర్ 2025లో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. 2026 జనవరి 15 రాత్రి 9 గంటల సమయంలో సీసీటీవీ అలర్ట్ వచ్చింది. ఫుటేజ్ చూసినప్పుడు.. మాజీ ఉద్యోగి సురేంద్రకుమార్ ఇంట్లోకి వచ్చి చోరీ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని విచారించగా, అతడు తన తప్పును ఒప్పుకున్నాడు. వెంటనే అంబోలి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Exit mobile version