Sumalatha Ambareesh Joins BJP: సీనియర్ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఉదయం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ చీఫ్ బీవై విజయేంద్ర సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అని చెప్పాలి. తాను బీజేపీలో చేరనున్నట్లు ఇటీవలే సుమలత అంబరీష్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి తాను మద్దతు ఇవ్వనున్నట్లు సుమలత అంబరీష్ వెల్లడించారు. మాండ్యా నియోజకవర్గంను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో తాను పనిచేయడం చూస్తారన్నారు. బీజేపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ.. తాను స్వతంత్ర ఎంపీ అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి రూ.4,000 కోట్ల నిధుల్ని రిలీజ్ చేసిందని సుమలత పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ప్రత్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలోకి దిగి ఓడిపోయారు.
Also Read: PM Candidate: ప్రధాని అభ్యర్థి ఎవరు.. రాహుల్ గాంధీ సమాధానం ఇదే!
2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులో భాగంగా మాండ్య సీటు జేడీఎస్‌కు దక్కింది. మాండ్య నుంచి కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. మాండ్య టికెట్ సుమలతకు లభిస్తుందని అంతా భావించినా.. కుమారస్వామి పోటీలోకి దిగడంతో ఆమె లోక్‌సభ బరి నుంచి తప్పుకున్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు సుమలత వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
