Avanigadda Assembly: అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? తమకే సీటు కేటాయించాలంటూ స్థానికల నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో.. అసలు టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ సాగుతోన్న తరుణంలో.. ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది జనసేన పార్టీ.. అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఖరారు చేసింది జనసేన అధిష్టానం..
మరోవైపు.. రైల్వేకోడూరు అభ్యర్థిపై జనసేన పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఇక, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థిపై కసరత్తు కొనసాగుతోందని జనసేన నేతలు చెబుతున్నారు.. రైల్వే కోడూరు అభ్యర్థి యనమల భాస్కరరావు పేరుపై సర్వేల్లో వ్యతిరేకత రావడంతో.. అభ్యర్థి విషయంలో జనసేన పునరాలోచనలో పడినట్టుగా ప్రచారం సాగుతోంది..
కాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కకపోవడంతో.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. అప్పటి నుంచి టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే అధిష్టానం ఖరారు చేసింది.. 1999, 2004, 2014లో అవనిగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు బుద్ధ ప్రసాద్.. గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు.. కొద్ది రోజుల వ్యవధిలోనే అవనిగడ్డ టికెట్ దక్కించుకున్నారు మండలి బుద్ధప్రసాద్.