Manda Krishna: షెడ్యూలు కులాల వర్గీకరణ కోసం సుధీర్ఘ పోరాటం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఎస్సీ వర్గకరణపై నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు. మాదిగల విషయంలో మొదటి దోషి కాంగ్రెస్, రెండో దోషి బీఆర్ఎస్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 3 పార్లమెంట్ స్థానాలలో ఒక్కటి కూడా మాదిగలకు కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. స్థానికుడు కానీ మల్లు రవికి టికెట్ ఇచ్చారని.. కానీ యువకుడు సంపత్ కుమార్‌కు ఇవ్వలేదన్నారు.
Read Also: RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
మాదిగలెవ్వరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. రాజకీయ భవిష్యత్ కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో రెండు స్థానాల్లో మాదిగలకు టికెట్ కేటాయించింది బీజేపీనే అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుండి సీఎంగా అయేవరకు మాదిగలు సపోర్ట్ చేశారు అని చెప్పారని.. కానీ ఇప్పుడు మాదిగలను ఎదగనివ్వడం లేదని విమర్శించారు. మాదిగలకు రేవంత్ సర్కార్‌లో అన్యాయం జరిగిందన్నారు. రాముడి జన్మస్థలం 500 ఏండ్ల చిరకాల వాంఛ నెరవేర్చింది మోడీనే అని ఆయన తెలిపారు. రామమందిర నిర్మాణం విషయంలో ఇతర మతస్థులు అపార్థం చేసుకోవద్దన్నారు. యేసు క్రీస్తు పుట్టిన ప్రదేశం జెరూసలేంకి క్రైస్తవులు.. ముస్లింలు మక్కా వెళ్లడం కరెక్ట్ అయితే హిందువులు అయోధ్యకు వెళ్లడం తప్పు కాదన్నారు. ఎవరి విశ్వాసాలు వారివి అని ఆయన చెప్పుకొచ్చారు
మోడీ సర్కార్‌లో మహిళలకు గౌరవం దక్కిందన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం వల్ల చాలా మంది ముస్లిం మహిళలు ఇబ్బందు పడుతున్నారు అని ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మోడీ రద్దు చేశారన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్ము కాశ్మీర్‌లో అందరికీ న్యాయం జరుగుతుందన్నారు మందకృష్ణ మాదిగ. ఇన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న మోడీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం అవుతుందన్నారు.