ప్రస్తుతం తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ‘రాకింగ్ స్టార్’ మంచు మనోజ్ తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్‌తో తన ఫోన్ మోగుతూనే ఉందని ఎమోషనల్ అయ్యారు. అభినందనలు వస్తున్నప్పటికీ.. తనకు ఇదంతా ఓ కలలా ఉందని చెప్పారు. మిరాయ్ కథలో తనను భాగం చేసినందుకు డైరక్టర్ కార్తిక్ ఘట్టమనేనికి జన్మంతా రుణపడి ఉంటానన్నారు. కార్తిక్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారు అని చెప్పారు. తమ్ముడు తేజ సజ్జా మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా మిరాయ్. నిన్న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా.. అంచనాలకు మించి విజయం సాధించింది. దాంతో రాకింగ్ స్టార్ ఆనందంలో మునిగిపోయారు.
మిరాయ్ చిత్ర యూనిట్ నేడు సక్సెస్ మీట్ నిర్వహించింది. సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ… ‘ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. 12 ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చింది. నిన్నటి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. పెద్ద పెద్ద వారి అభినందనలు వస్తున్నప్పటికీ.. నాకు ఇదంతా ఓ కలలా ఉంది. మిరాయ్ కథలో నన్ను భాగం చేసిన డైరక్టర్ కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటా. ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ‘అన్నా సినిమా ఎప్పుడు, కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అడిగేవారు. త్వరలోనే వస్తానని చెప్పేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల ఎదో తెలియని భయం ఉండేది. ఆ సమయంలో కార్తిక్ నన్ను కలవడం అదృష్టం. అతడు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు’ అని చెప్పారు.
‘నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా? అని భయపడుతూ ఉండేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ తొలగించారు. నిర్మాత విశ్వప్రసాద్ గారి పాషన్‌కి హ్యాట్సప్. అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు. తమ్ముడు తేజ మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు. రితిక అద్భుతంగా నటించారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. నా చిన్ననాటి క్యారెక్టర్ చేసిన ఇద్దరు కూడా బాగా చేశారు. గౌరీ హర గారు సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా డైరెక్టర్ గారికి హాట్సాఫ్. శ్రీకర్ ప్రసాద్ గారితో కలిసి వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పాదాభివందనం. నామీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపై వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని మంచు మనోజ్ తెలిపారు.
