మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపిస్తూ, రికార్డులను తిరగరాస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో, నయనతార స్టన్నింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడం తో, యూత్ నుండి పెద్దల వరకు అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరు డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే..
తాజా సమాచారం ప్రకారం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పండుగ సెలవుల నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు మరింత పెరిగింది. మొదటి రోజునే రూ. 84 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో చిరంజీవి కెరీర్‌లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన ఈ సినిమా, మూడో రోజు మకర సంక్రాంతి సెలవు దినాన్ని అద్భుతంగా వాడుకుని 150 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. దీంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ‘శంకరవర ప్రసాద్ గారు’ మెగా అభిమానులకు అసలైన పండుగను తీసుకువచ్చారు.
