Site icon NTV Telugu

Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు

Ramesh

Ramesh

ప్రపంచమంతా విచారంలో మునిగిపోయింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్-787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు విమానంలో ప్రయాణించిన వారంతా చనిపోయారని సమాచారం వినిపిస్తోంది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం మృతుల్లో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 230 మంది మృతుల్లో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు. మృతుల్లో 217 మంది పెద్దవారు, 11 మంది పిల్లలు, ఇద్దరు పసివాళ్లు.

Also Read:Air India Plane Crash: విమాన ప్రమాదంపై వరల్డ్ లీడర్స్ స్పందన.. ఎవరేమన్నారంటే?

విమాన ప్రమాదంలో 169 మంది భారతీయులు మృతి చెందారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం విజయ్ రూపానీ సహా విమానంలో 242 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. అయితే ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిరిండియా ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచాడు. 11A సీటులోని ప్రయాణికుడు బతికి బయటపడ్డట్టు గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని 38 ఏళ్ల రమేశ్ గా గుర్తించారు. స్వల్పగాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విమాన ప్రమాద బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version