Site icon NTV Telugu

Mallikarjun Kharge: కాంగ్రెస్‌ కొత్త సారథిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: కాంగ్రెస్ కొత్త సారథిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై భారీ విజయం సాధించిన మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. ఆయనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని.. ఖర్గే నాయకత్వంలో పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు. మల్లికార్జున ఖర్గే ఎంతో అనుభవమున్న నాయకుడని ఆమె అన్నారు.

అంతకుముందు మల్లికార్జున ఖర్గే రాజ్‌ఘాట్‌లో మహాత్మగాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతివన్‌, శక్తిస్థల్‌లను సందర్శించిన ఆయన.. మాజీ ప్రధానులు జవహర్​లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలకు నివాళులు అర్పించారు. అక్టోబర్‌ 19న వెలువడిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ​ అధ్యక్ష రేసులోకి అనూహ్యంగా అడుగుపెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే.. తన ప్రత్యర్థి శశిథరూర్‌పై భారీ ఆధిక్యంతో గెలిచారు. తద్వారా 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

Thailand: 19 ఏళ్ల అబ్బాయికి 56 ఏళ్ల బామ్మతో నిశ్చితార్థం.. రెండేళ్లుగా సహజీవనం

కాంగ్రెస్ కొత్త సారథిగా పగ్గాలు చేపట్టిన ఖర్గేకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు ఆయన నాయకత్వానికి సవాళ్లుగా నిలవనున్నాయి. రాజస్థాన్‌, కర్ణాటకలో నెలకొన్న అంతర్గాత రాజకీయాలను పరిష్కరించాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ముందుండి నడిపించడం ఓ పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. మల్లికార్జున ఖర్గేను రిమోట్‌తో నియంత్రించేంది సోనియా కుటుంబమేనని వస్తున్న ఆరోపణలను కూడా తిప్పికొట్టేలా చేయడం కూడా ఆయన ముందున్న ఓ సవాలే.

Exit mobile version