Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..

Grinder App

Grinder App

హైదరాబాద్ నగరంలో డేటింగ్ యాప్ వేదికగా పరిచయాలు పెంచుకుని, మత్తుమందు ఇచ్చి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, చందు అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి మీడియాకు వెల్లడించారు.

నిందితులు ‘గ్రైండర్’ (Grindr) డేటింగ్ యాప్ ద్వారా బాధితులను లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా యాప్‌లో ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్ మాట్లాడుతూ పరిచయం పెంచుకునేవారు. ఈ క్రమంలో బాధితులు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? వారి వద్ద బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్నాయా? అనే వివరాలను ముందే ఆరా తీసేవారు. బాధితులకు పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత వారి ఇళ్లకు వెళ్లేవారు. అక్కడ మద్యం సేవించే సమయంలో బీర్‌లో మత్తు పదార్థాలు కలిపి బాధితులకు ఇచ్చేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యేవారు.

వరుస ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ముగ్గురు నిందితులను ఉప్పల్ పోలీసులు పట్టుకోగా, ఏఎస్ రావు నగర్‌లో మరో ఇద్దరిని కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుల నుంచి సుమారు 361 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాపై మొత్తం 14 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 2, సైబరాబాద్‌లో 7, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నిందితుల మొబైల్ ఫోన్లు, గ్రైండర్ యాప్ ప్రొఫైల్స్, చాటింగ్స్, కాల్ డేటా ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న చందు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.