అన్నది అధికార పార్టీ. తమ్ముడేమో…. విపక్షం మీటింగ్‌లో ప్రత్యక్షం. మధ్యలో కార్యకర్తల పరిస్థితి ఏంటి..? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? సోదరుడి వ్యవహారంతో మరోసారి వివాదాస్పద వార్తల్లోకి ఎక్కిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనకు తెలిసే తమ్ముడు విపక్ష వేదికనెక్కారా? బ్రదర్స్ రెండు పడవల ప్రయాణం చేయాలనుకుంటున్నారా? లేక అంతకు మించిన వ్యూహం ఉందా?
Also Read:DSP Richa Ghosh: టీమిండియాలో మరో డిఎస్పీ.. నియామకపత్రం అందజేత..
గూడెం మహిపాల్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత. కానీ ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారాయన. మనీలాండరింగ్ కేసులో ఈడీ సోదాలు ఓ వైపు, మైనింగ్ కేసులో తమ్ముడు మధుసూదన్ అరెస్ట్ మరోవైపు…. ఇలా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ ఊపులోనే…నిరుడు జులైలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే…ఎమ్మెల్యే రాకను స్థానిక కాంగ్రెస్ నేత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అప్పట్లోనే వ్యతిరేకించారు. పార్టీలోకి వచ్చాక కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాల్లేవు. ఎమ్మెల్యే స్థాయిలో తన వ్యవహారాలు తాను నడిపిస్తున్నారు మహిపాల్‌రెడ్డి.
అయితే గత కొన్ని నెలలుగా ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు బలహీనపడిపోతున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల కేసు తెరమీదకి రావడం, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహతో పడకపోవడం, లోకల్ కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం లాంటి కారణాలతో…ఎమ్మెల్యే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఈ అనుమానాలు బలపడేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామం జరిగింది.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ మీటింగ్‌లో ప్రత్యక్షం అవడం రాజకీయంగా కలకలం రేపింది. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూం కాలనీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు మధు. ఇప్పుడు ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
అన్న ఓవైపు పార్టీ ఫిరాయింపుల కేసు ఎదుర్కొంటున్న సమయంలో తమ్ముడు ఇలా బీఆర్ఎస్ నేతలతో కలిసి రాజకీయ వేదికను పంచుకోవడంపై రకరకాలు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గూడెం బ్రదర్స్ ఇమడలేకపోతున్నారని, త్వరలోనే తిరిగి కారెక్కుతారన్న ప్రచారం మొదలైంది. దీనికి తోడు ఈ నెల 3న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు కొల్లూరులో పర్యటించినప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అటెండ్ అవలేదు. కానీ బీఆర్ఎస్ కార్యక్రమానికి మాత్రం ఎమ్మెల్యే సోదరుడు వెళ్ళడంతో.. తెర వెనక ఏదో జరిగిపోతోందన్న అనుమానాలకు బలం ఇచ్చినట్టయింది. గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో ఉన్నా..ఎమ్మెల్యే అనుచరుడు నామినేషన్ వేశారు. ఈ వ్యవహారం అప్పట్లో రచ్చరచ్చ అయింది. తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ మీటింగ్ కి ఎమ్మెల్యే సోదరుడు హాజరుకావడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారట.
Also Read:Anchor Suma : మేం విడిపోవాలని కోరుకున్నారు.. రాజీవ్ తో బంధంపై సుమ కామెంట్స్
ఇదే విషయంపై మరోసారి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అన్న మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా… అంటీముట్టనట్టు ఉంటుంటే…తమ్ముడు మధు ఏకంగా ప్రతిపక్ష పార్టీ నేతల మీటింగ్‌కు హాజరుకావడంపై గుసగుసలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. మహిపాల్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా.. లేదా తిరిగి గులాబీ గూటికి చేరుతారా అని ఇటు కాంగ్రెస్ నేతలు, అటు గులాబీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. గూడెం బ్రదర్స్ అటా ఇటా లేదా ఎన్నికల వరకు రెండు పడవల ప్రయాణం చేస్తారా అన్నది చూడాలి మరి.
