Site icon NTV Telugu

Ajit Pawar: మహారాష్ట్రలో ముగిసిన ‘పవార్’ పాలిటిక్స్‌.. కింగ్ మేకర్ కలలు కల్లలయ్యాయి!

Ajit Pawar

Ajit Pawar

Ajit Pawar: బాబాయ్ చాటు అబ్బాయిలా రాజకీయాల్లోకి దిగి.. మహారాష్ట్రా పాలిటిక్స్‌లో ‘పవార్’ మార్క్‌ను క్రియేట్ చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్. మహారాష్ట్రలో రాబోయే జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం బారామతిలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సమావేశాలలో పాల్గొనడానికి బుధవారం (జనవరి 28) ఉదయం 8 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బారామతికి బయలుదేరారు. అయితే బారామతి విమానాశ్రయం రన్‌వేపై ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదవశాత్తు ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఆయన పర్సనల్ అసిస్టెంట్, సెక్యూరిటీ సిబ్బంది ఒకరు, పైలట్, కో పైలట్‌ ఉన్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొంది.

READ ALSO: Tiananmen: చరిత్ర నుంచి రక్తపాతాన్ని తుడిచివేసే ప్రయత్నం.. చైనా బరితెగింపు రాజకీయం!

రాయకీయ చదరంగంలోకి అజిత్ పవార్ ఎంట్రీ..
అజిత్ పవార్ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని దేవ్‌లాలి ప్రవరాలో 1959 జూలై 22న జన్మించారు. శరద్ పవార్ అన్నయ్య అనంతరావు గోవిందరావు పవార్ కుమారుడే అజిత్ పవార్. స్థానికంగా ఆయన్ను చాలా మంది ‘దాదా’ (అన్నయ్య) అని పిలుస్తారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌. ఈ దంపతులకు పార్థ్, జయ్ పవార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 1982లో రాజకీయ ప్రభావం బలంగా ఉన్న స్థానిక చక్కెర సహకార సంస్థ బోర్డు ఎన్నికల ద్వారా అజిత్ పవార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన 16 ఏళ్లు పుణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ టైంలో ఆయన ఈ ప్రాంతంలో స్థానికంగా బలాన్ని కూడగట్టుకున్నారు. అజిత్ పవార్ 1991లో అసలైన పవర్ పాలిటిక్స్‌లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన 1991లో తొలిసారిగా బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ పీవీ నరసింహారావు ప్రభుత్వంలో శరద్ పవార్ రక్షణ మంత్రిగా ఛార్జ్ తీసుకోవడంతో, శరద్ పవార్ కోసం అజిత్ పవార్ తన ఎంపీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే అదే ఏడాది అజిత్ పవార్ బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1999లో కాంగ్రెస్ నుంచి శరద్ పవార్ బయటికి వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) స్థాపించారు. ఆ టైంలో అజిత్ పవార్ కూడా శరద్ పవార్ వెంట నడిచి ఎన్సీపీలో క్రియాశిల నాయకుడిగా ఎదిగారు. అజిత్ పవార్ పొలిటికల్ లైఫ్ చాలా సింపుల్‌గా ఏం సాగలేదు. ఐదుసార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సంచలన మలుపు 2023 జులైలో చోటుచేసుకుంది. ఆ టైంలో అజిత్ పవార్ పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే – బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రెండుగా విడిపోయింది. ఫిబ్రవరి 2024 నాటికి, భారత ఎన్నికల సంఘం శాసనసభ మెజారిటీ ఆధారంగా అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్ని అధికారిక ఎన్సీపీగా గుర్తించింది. అదే ఏడాది నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేసి, 41 స్థానాలను కైవసం చేసుకుంది. 2024లో అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. తాజాగా ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటూనే విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన తన జీవితంలో సీఎం పదవిని చేపట్టాలని చాలా కలలు కన్నారని, కానీ వాటిని నిజం చేసుకోకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: MLA Arava Sridhar Controversy: న్యూడ్ ఫోటోలు పంపించమని అడిగాడు.. ఎమ్మెల్యేనంటూ బెదిరించాడు!

Exit mobile version