NTV Telugu Site icon

Nagpur Bus Driver: చేతికి బుల్లెట్‌ గాయం.. 30 కిమీ బస్సు నడిపిన డ్రైవరు! 35 మంది సేఫ్

Nagpur Bus Driver Bullet

Nagpur Bus Driver Bullet

మహారాష్ట్రలో ఓ మినీ బస్సు డ్రైవరు పెద్ద సాహసం చేశాడు. దోపిడీ దొంగల కాల్పుల్లో చేతికి బుల్లెట్‌ తగిలినా.. బస్సును ఆపకుండా 30 కిమీ నడిపి సురక్షితంగా పోలీస్‌స్టేషకు చేరుకున్నాడు. దాంతో దాదాపు 35 మంది ప్రయాణికుల ప్రాణాలను మినీ బస్సు డ్రైవర్ రక్షించాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని అమరావతి-నాగ్‌పూర్ హైవేపై షెగావ్ సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవరు చూపిన తెగువతో తాము దోపిడీ దొంగలకు బారినుంచి సురక్షితంగా బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు.

డ్రైవరు ఖోమ్‌దేవ్‌ కవాడే మాట్లాడుతూ… ‘అమరావతి ఆలయాన్ని దర్శించుకొని షేగావ్ నుంచి నాగ్‌పుర్‌కు తిరుగుప్రయాణం అయ్యాము. వెనుక ఓ బొలెరో కారు బస్సును వెంబడించింది. బస్సును ఓవర్‌టేక్ చేస్తారేమో అని రెండుసార్లు దారి ఇచ్చినా.. కారు ముందుకు వెళ్ళలేదు. దుండగులు మళ్లీ బస్సు వెనక్కే వచ్చారు. అది యూపీ కారు. కొంతసేపటికి బస్సు ముందుకు వచ్చిన దుండగులు.. కారులో నుంచే కాల్పులు జరిపారు. బస్సుపైకి నాలుగు రౌండ్స్ కాల్పులు జరిపారు. మొదటిసారి తప్పించుకోగలిగినా.. రెండోసారి నా చేతిపై కాల్చారు. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే 30 కిమీ బస్సు నడిపా’ అని తెలిపాడు.

Also Read: BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో భారీగా పోస్టుల భర్తీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఖోమ్‌దేవ్‌ కవాడే చేతికి రక్తస్రావం అవుతున్నా నాగ్‌పూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవాడి గ్రామంలో దుండగులను తప్పించుకుని.. 35 మంది ప్రయాణికులను టియోసా పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా బస్సులో తీసుకొచ్చాడు. పోలీసులు బస్సును తిరిగి నందగావ్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. డ్రైవర్‌ను వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దుండగుల సమాచారం కోసం నాగ్‌పూర్ సమీపంలోని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కారు నాగ్‌పూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.