Maha Shivratri 2025: మహా శివరాత్రి భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మహా శివరాత్రిని ప్రత్యేక ఉత్సవాలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా చెరలో ఒకసారి చూద్దాం.
తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలు:
వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం, ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకున్న పవిత్ర స్థలం ఇది. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
కొమురవెల్లి:
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం కూడా శివ భక్తులకు ఎంతో ప్రాముఖ్యత కలిగినది. 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో కొలువుదీరాడు. సంక్రాంతి పర్వదిన సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు విశేషంగా ఉంటాయి. మహా శివరాత్రి రోజున ఇక్కడ జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.
రామప్ప ఆలయం:
కాకతీయుల కాలంలో నిర్మించబడిన చారిత్రక దేవాలయం రామప్ప ఆలయం. ఇది హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లాలో ఉంది. రామలింగేశ్వరుడి రూపంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు ప్రసిద్ధి.
కాళేశ్వరం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుడిలో.. ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉంటాయి. పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉండడం విశేషం. గుడిలోని కాళేశ్వరుడిని (యముడు) పూజించి, ఆ తర్వాత ముక్తేశ్వరుడిని (శివుడు) పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
వెయ్యి స్తంభాల గుడి:
వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి కాకతీయుల కాలం నాటి గొప్ప నిర్మాణం. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలో శివుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు కలిసి కొలువై ఉన్నారు.
వీటితోపాటు రాష్ట్రంలో కీసర, పానగల్, రాచకొండ, ఐనవోలు, చెరువుగట్టు ప్రాంతాలలో ప్రముఖ శైవక్షేత్రాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రాలు:
శ్రీశైలం:
నల్లమల కొండలపై వెలసిన శ్రీశైలం ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచింది. ఇక్కడ భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు.
ద్రాక్షారామం:
తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం హిందూ పురాణాలలో గొప్ప స్థానం కలిగి ఉంది.
శ్రీకాళహస్తి:
తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయం వాయు లింగంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ ప్రార్థన చేస్తే శాంతి, ఆనందం పొందుతారని నమ్మకం.
మహానంది:
నల్లమల కొండలలో ఉన్న మహానంది ఆలయం ప్రాచీనమైనది. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న కోనేరులలో నీరు ఎంతో స్వచ్ఛగా ఎల్లకాలం ఉంటాయి.
అమరేశ్వర ఆలయం:
అమరావతిలోని అమరేశ్వర ఆలయం కృష్ణా నది ఒడ్డున ఉన్న పంచారామ క్షేత్రాలలో ఒకటి.
క్షీరారామ ఆలయం:
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న క్షీరారామ ఆలయం, పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది ఎత్తైన గోపురానికి ప్రసిద్ధి.
రామలింగేశ్వర ఆలయం:
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రామలింగేశ్వర ఆలయం శిల్పసంపదకు ప్రసిద్ధి.
సోమారామ ఆలయం:
భీమవరంలో ఉన్న సోమారామ ఆలయం, పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి శివలింగం పౌర్ణమి సమయంలో రంగు మారుతుందని భక్తుల నమ్మకం.
యాగంటి:
నంద్యాల జిల్లాలోని యాగంటి ఆలయం పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ భారీ నంది విగ్రహం ప్రసిద్ధి. అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కాకులు ఎగరవు.