దేశ ప్రజలంతా దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్నారు. దసరా రోజున రావణాసురుడి, సూర్పణక దహనాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అయ్యింది ఓ సామాజిక సంస్థ. దసరా రోజున ‘సుర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ తెలిపింది. సోనమ్‌తో పాటు భర్తలను, పిల్లలను, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు ఉంటాయని పేర్కొంది.
అయితే ఈ వ్యవహారంపై సోనమ్ తల్లి సంగీత ఆ సంస్థకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ప్రణయ్ వర్మతో కూడిన సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. అలాంటి దిష్టిబొమ్మ దహనానికి అనుమతి లేదని శనివారం కోర్టు తీర్పునిచ్చింది. పిటిషనర్, ఆమె కుమార్తె, కుటుంబం ప్రాథమిక హక్కులను ఇది ఉల్లంఘిస్తుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేరు అని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి దిష్టిబొమ్మ దహనం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లను హైకోర్టు ఆదేశించింది.
Also Read:Karthik Varma : క్రేజీ డైరెక్టర్ ఎంగేజ్ మెంట్.. సెలబ్రిటీల సందడి
కాగా రాజా రఘువంశీని సోనమ్ పెళ్లాడిన తర్వాత హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అప్పటికే ప్రియుడున్న సోనమ్ భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి రాజా రఘువంశీని హత్య చేసింది. ఈ ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
