NTV Telugu Site icon

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్‌ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లికి ఏపీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాస్ పోర్ట్ సమర్పించాలని పిన్నెల్లికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారి దగ్గరకు వారానికి ఒకసారి వెళ్లి సంతకం చేయాలని షరతు విధించింది.50 వేలతో రెండు పూచీ కత్తులు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లొద్దని పిన్నెల్లికి హైకోర్టు ఆదేశించింది. షరతులకు కట్టుబడి ఉంటానని.. బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరగా ఈ మేరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Read Also: Love couple suicide attempt: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలించిన భర్త..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఈవీఎం ధ్వంసం చేసిన కేసు, హత్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లిని పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశారు. జూన్ 26 నుంచి పిన్నెల్లి నెల్లూరు జైలులోనే ఉన్నారు. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్‌ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో బెయిల్‌ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నేడు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.