Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మలిహాబాద్ ప్రాంతంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన భార్యకు ప్రియుడితో కలిసి జీవించాలనే కోరిక ఉందని తెలుసుకున్న ఓ పీఆర్‌డీ జవాన్ ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు, ఆమెను అడ్డుకోకుండా ప్రియుడితోనే వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
పీఆర్‌డీ జవాన్‌కు సుమారు ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలం వరకు దంపతుల జీవితం సాధారణంగానే సాగింది. అయితే కొన్ని రోజుల క్రితం అతని భార్య ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం పోలీసులు మహిళను ఆమె ప్రియుడితో కలిసి గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. మహిళను కుటుంబ సభ్యులు నచ్చజెప్పి తిరిగి ఇంటికి రావాలని కోరారు. అయితే ఆమె మాత్రం తన ప్రియుడితోనే కలిసి జీవించాలని స్పష్టంగా చెప్పింది. దీంతో భర్త ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆమెను బలవంతంగా తనతో తీసుకెళ్లకుండా, పరస్పర అంగీకారంతో విడిపోవడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఇరు కుటుంబాల అంగీకారం, అవసరమైన న్యాయపరమైన ప్రక్రియ పూర్తైన అనంతరం మహిళకు ఆమె ప్రియుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత స్థానిక ఆలయంలో ఇద్దరికీ వివాహం జరిపించారు. వారు ఆలయంలో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మహిళను ఆమె ప్రియుడితో కలిసి పంపించారు. ఇరు వర్గాల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ వ్యవహారంపై ఎవరూ ఎలాంటి న్యాయపరమైన ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

