NTV Telugu Site icon

Zaheer Khan: ఓటమిని అంగీకరిస్తున్నాం.. మాకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి!

Zaheer Khan Lsg

Zaheer Khan Lsg

సొంత మైదానం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓడిపోవడం తమను బాధించిందని లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌ జహీర్‌ ఖాన్ తెలిపాడు. హోం గ్రౌండ్స్‌లో తమకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయని, తప్పకుండా అభిమానులను అలరిస్తామని చెప్పాడు. ఎకానా క్రికెట్ స్టేడియం తమకు హోం గ్రౌండ్‌ అయినప్పటికీ.. పంజాబ్ కింగ్స్ క్యురేటర్‌ ఇక్కడ ఉన్నట్లు అనిపించిందన్నాడు. తప్పకుండా రాబోయే మ్యాచుల్లో విజేతగా నిలుస్తాం అని జహీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ఓడిపోయింది.

గాయాలతో ఎల్‌ఎస్‌జీ పేస్‌ విభాగం కాస్త బలహీనంగా ఉన్నప్పుడు.. స్పిన్‌కు అనుకూలంగా పిచ్‌ను తయారుచేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వెలువడ్డాయి. వీటిపై ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ జహీర్‌ ఖాన్ మాట్లాడుతూ… ‘సొంత మైదానంలో ఈ ఫలితం నిరాశపర్చింది. టీమ్‌లు అన్ని తమ హోం గ్రౌండ్‌లో పిచ్‌ను అనుకూలంగా తయారుచేసుకుంటాయి. లక్నో పిచ్‌ క్యూరేటర్ మాత్రం అలా ఆలోచించినట్లు లేదనిపిస్తోంది నాకు. పంజాబ్ క్యూరేటరే ఈ పిచ్ రూపొందించినట్లుంది. ఈ అంశాలపై మేం ఫోకస్ పెడతాం. పిచ్‌ విషయంలో ఇకపై పొరపాట్లు జరగవని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.

Also Read: Shreyas Iyer Record: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!

‘అభిమానులు మామీద ఎన్నో అంచనాలు పెట్టుకొని మైదానానికి వస్తారు. తొలి మ్యాచ్‌లోనే జట్టు ఓడిపోవడం వల్ల చాలా నిరాశపడ్డారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేయడం సరైంది కాదు. జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. ఓటమిని మేం అంగీకరిస్తున్నాం. పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతాం. మాకు ఇక్కడ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి. అభిమానులను తప్పకుండా అలరిస్తాం. ఇలాంటి టోర్నీలలో పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉండాలి. పరుగులు చేయాలనే ఆకలి ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించాలి. ఆటలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది. వచ్చే మ్యాచ్‌లలో విజేతగా నిలుస్తాం’ అని జహీర్‌ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.