తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుని.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్లపాటు జీవించాల్సిన వాళ్లు సగం జీవితం గడపకుండానే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ముందుగా ప్రేమించినప్పుడు లేని భయం.. పెద్దలకు చెప్పి ఒప్పించడానికి ఎందుకు వస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రేమజంటల ఆత్మహత్యలు రోజుకు ఒక్కసారి ఎక్కడోచోట వినాల్సి ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది.
Read Also: Silkworms Cultivation: లాభాలను అందిస్తున్న పట్టుపురుగుల పెంపకం..
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామ సముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన బోడె కళ్యాణి.. చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్ గా గుర్తించారు. వీరిద్దరూ బుగ్గనూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. అయితే వీరు గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ఆదివారం పశువులను కాసేందుకు కాపరులు అడవిలోకి వెళ్లగా అక్కడ ప్రేమజంట చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.