LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్‌ విడుదల..

Lk Advani

Lk Advani

LK Advani Health Update: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, దేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతిలో ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఆయన్ను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెంటనే ఆస్పత్రికి వెళ్లి అద్వానీని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో 98 ఏళ్ల అద్వానీని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటిన్‌ను విడుదల చేసింది. నూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి నేతృత్వంలోని వైద్యుల బృందం అద్వానీకి చికిత్స అందిస్తోందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేసింది. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే అద్వానీని ప్రధాని మోడీ కలిశారు. ప్రభుత్వ ప్రధాన పదవుల్లో మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అక్టోబర్ 7న ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటీ తర్వాత ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దశాబ్దాల పాటు అద్వానీ అందించిన ప్రజా సేవ దేశ చరిత్రలో ఎంతో ప్రభావం చూపిందని కొనియాడారు. దేశ ప్రగతిని బలపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఎంతో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న లాల్ కృష్ణ అద్వానీ.. బీజేపీని దేశంలోనే బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రముఖ భూమిక పోషించారు. చాలా ఏళ్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా సేవలందించారు. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగానూ అత్యంత కీలక బాధ్యతలు చేపట్టారు. అద్వానీ తన రాజకీయ జీవితంలో ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.