Lightning Strike: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఐదుగురు రైతులు పొలం పనికి వెళ్లగా.. వర్షం పడడంతో చెట్టు కిందకు వెళ్లి నిలుచున్నారు. కంబాల శ్రీనివాస్, కొమురవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాస్‌లు చెట్టు కింద నిలబడగా.. ఆ చెట్టుపై పిడుగు పడింది. పిడుగు పాటుకు కంబాల శ్రీనివాస్ (32) సమీపంలో పడడంతో అక్కడిక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. వారిని వేములవాడలోని ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుతో శ్రీనివాస్ మృతి చెందడంతో అతని కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Lift Fell Down: బట్టల షాఫులో తెగిపడిన లిఫ్ట్.. పలువురికి తీవ్రగాయాలు
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలో కూడా పిడుగుపాటుకు ఓ రైతు బలయ్యాడు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రుద్రారపు చంద్రయ్య(50) చెట్టుకింద నిలబడగా.. పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన ఎనుగుల మల్లయ్య అనే రైతుకు సంబందించిన ఆవు, దూడ పిడుగు పాటుతో మృతి చెందాయి. సుమారు 1,25 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.