ఇటీవల రామ్ చరణ్, ఉపాసనలకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని పంచుకుంటూ మీడియాతో మాట్లాడారు. అయితే, గతంలో చిరంజీవి గారు సరదాగా చేసిన “వారసుడు కావాలి” అనే వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు ఇప్పుడు తప్పుగా వాడుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘అమ్మాయి (క్లింకార) పుట్టినప్పుడు ఇంత సంబరం లేదు కానీ, ఇప్పుడు అబ్బాయి పుట్టగానే ఇంత హడావిడి చేస్తున్నారా?’ అంటూ ఒక నెటిజన్ అభ్యంతరకరంగా ట్వీట్ చేశారు. దీంతొ ఈ ట్వీట్‌పై లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
‘ఈ ట్వీట్ చాలా తప్పుడా ఉంది. ఇంత సంతోషకరమైన క్షణాన్ని అసహ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాళ్లను ఎంత ప్రేమగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే దాంట్లో 1 శాతం కూడా చాలా మంది మగాళ్లు చేయలేరు. తెలియకుండా ఇలాంటి కామెంట్స్ చేయకండి’ అంటూ గట్టిగా బదులిచ్చారు. అయితే తాజాగా ఆమె నటిస్తున్న ‘సతి లీలావతి’ (Sathi Leelavathi) సినిమా ప్రెస్ మీట్‌లో మీడియా వారు ఈ విషయం గురించి అడగగా.. లావణ్య తన స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేశారు. ‘నేను నా కుటుంబానికి అండగా నిలబడ్డాను. నా ఫ్యామిలీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను అస్సలు సహించను’ అని కుండబద్దలు కొట్టారు. మెగా కోడలిగా ఆమె చూపిస్తున్న ఈ ధైర్యం కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమని చూసి మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
