గజ్వేల్ లో దాఖలైన నామినేషన్లపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 127 మంది వేసిన నామినేషన్లలో 13 నామినేషన్లను ఆర్వో అధికారులు తిరస్కరించారు. ఇక, గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 114 మంది అభ్యర్థులు ఉండనున్నారు. బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా సీఎం కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డితో పాటు బరిలో 114 మంది ఉన్నారు. తమ సమస్యలు తెలియడానికి సీఎం కేసీఆర్ పై స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు బాధితులు నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్ వేసిన వారిని బీఆర్ఎస్ పెద్దలు బుజ్జగిస్తున్నారు. రేపటి వరకే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండటంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. నామినేషన్ లో సెల్ ఫోన్ల ఆధారంగా కాల్స్ చేసి బీఆర్ఎస్ నేతలు బ్రతిమిలాడుతున్నారు.
Read Also: Gautam Singhania: భార్యతో విడిపోయిన రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా.. కారణం ఏంటంటే?
అయితే, సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఈ నామినేషన్లు దాఖలు చేసినట్లు బాధితులు తెలియజేస్తున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి చెందిన వారు వందకు మంది పైగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే మూతబడిన చెరుకు ఫ్యాకర్టీని తిరిగి ఓపెన్ చేయాలని నామినేషన్లు వేశారు. వీరితో పాటు నిరుద్యోగ సమస్యలను పరిష‌్కరించలేదని కోరుతూ 30 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. తాము అధికారంలోకి రాగానే సమస్యలకు పరిష్కారం చూపుతామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇస్తున్నారు. కొందరు నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ నేతల ఇచ్చే హామీతో వెనక్కి తగ్గుతున్నారు.. కానీ మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపే ఆఖరి రోజు కావడంతో ఉపసంహరించుకుంటారా? లేదా? అన్న టెన్షన్ గులాబీ పార్టీ నేతల్లో మొదలైంది.