Amit Shah: బిహార్‌లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్‌లో బీజేపీ సోలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పేరిట ఆయన సమర్థవంతంగా ప్రారంభించారు. జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు బీజేపీకి ద్రోహం చేశారంటూ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై కేంద్ర హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమిత్ షా ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
గత నెలలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమి నుంచి కుమార్ వైదొలగి, కాంగ్రెస్‌తో మహాఘటబంధన్ (మహాకూటమి)లో చేరిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన మొదటి ర్యాలీ ‘జన్ భవన మహాసభ’. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచిపెడతారని, 2025లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “2014లో, మీకు (బీహార్ సీఎం నితీష్ కుమార్) 2 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉండేవి, 2024 లోక్‌సభ ఎన్నికలు రానివ్వండి. బిహార్ ప్రజానీకం లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచిపెట్టేస్తారు. మేము పూర్తి మెజారిటీతో 2025 ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి రాబోతున్నాం.” అని అమిత్ షా అన్నారు. ఈ సారి బిహార్‌లో మోడీ కమలం మాత్రమే వికసిస్తుందని అన్నారు. నితీష్ కుమార్ ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలకు మొగ్గు చూపరని, అధికారంలో కొనసాగేందుకు ఏ పార్టీతోనైనా చేతులు కలపవచ్చని అమిత్ షా అన్నారు. తన ప్రసంగంలో, కేంద్ర హోం మంత్రి రాష్ట్రంలో విమానాశ్రయంతో సహా పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు.
Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు
“దాణా కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తులు మీ కేబినెట్‌లో మంత్రులుగా ఉంటే, మీరు వారిని ఎలా పట్టుకుంటారు అని నేను నితీష్ కుమార్, కొత్త మంత్రి లలన్ సింగ్‌లను అడగాలనుకుంటున్నాను? ఆపై లాలూ ఒత్తిడితో సీబీఐని నిషేధించాలని సీఎం ఆలోచిస్తున్నారు. బిహార్‌పై ‘జంగిల్ రాజ్’ ప్రమాదం పొంచి ఉంది’’ అని ఆయన అన్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం కిషన్‌గంజ్‌లో బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేంద్ర హోంమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించనున్నారు.