Lal Darwaza Bonalu 2025 Rangam and Gavu Patta Today: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు ఆదివారం బోనాలను సమర్పించారు. నిన్న ఘనంగా బోనాల సమర్పణ, అమ్మవారి శాంతి కళ్యాణం జరిగాయి. నేడు సింహవాహిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేడు మధ్యాహ్నం తరువాత పచ్చి కుండపై రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పోతరాజుల గావు పట్టే కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో పాటు ఘటాలు, పలహర బండ్ల ఊరేగింపు ఉంటాయి.
Also Read: Gutha Sukender Reddy: ప్రజలు చీదరించుకుంటున్నారు.. రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలి!
రంగం భవిష్యవాణి కార్యక్రమం సందర్భంగా లాల్ దర్వాజా ప్రధాన అర్చకులు కార్తికేయ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. ఉదయాన్నే మొదటి పూజ సువర్ణ పుష్పాలతో నిర్వహించాము. ఈ రోజు భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఈ భవిష్యవాణి వినడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అమ్మవారు, స్వామి వారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు అనంతరం ఉత్సవ విగ్రహాలను నదిలో నిమర్జనం చేయడంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి’ అని ప్రధాన అర్చకులు కార్తికేయ తెలిపారు.
రెండో రోజు కూడా భక్తులతో రద్దీగా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం కొనసాగుతోంది. సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. మధ్యాహ్నం తరువాత జరిగే రంగం భవిష్యవాణి కార్యక్రమంలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. భవిష్యవాణి తరువాత ఘనంగా అమ్మవారి ఊరేగింపుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. పోతరాజుల విన్యాసాలు, వివిధ వేషధారణలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా అమ్మవారి ఊరేగింపు జరగనుంది.
