NTV Telugu Site icon

Kakinada: పెళ్లి పేరుతో ఘరానా మోసం.. రూ.6లక్షలు కాజేసిన ముఠా

Marriage

Marriage

Kakinada: పెళ్లిపేరుతో మోసం చేసిన ఓ ముఠాపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. బాధితుడినే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది నకిలీ పెళ్లికూతురు. ఫోన్‌ చేసి వేధించాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ పెళ్లి పేరుతో మోసం ఎలా జరిగిందంటే..

Read Also: Female Doctor Murder: కోల్‌కతాలో డాక్టర్‌ హత్య.. హైదరాబాద్‌ లో జూడాల నిరసనలు..

బాధితుడి ఊరు కాకినాడ.. వయస్సు 40 దాటింది.. కానీ ఇంకా పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కావాలని ఇంకా పెళ్లి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తి శిరీష పరిచయమైంది. ఓ సంబంధం కూడా చూపించింది. కృష్ణమోహన్‌కు అమ్మాయి నచ్చకపోవడంతో వద్దని చెప్పేశాడు. రాజమండ్రిలో మరో అమ్మాయి ఉందంటూ నీరజ అలియాస్ చిన్ని ఫోటోను పంపించింది శిరీష. అమ్మాయి నచ్చిందని చెప్పగానే ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాటు చేసింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, బంధువులుగా కొంతమందిని సెట్‌ చేసింది. ఎంగేజ్‌ మెంట్‌ కోసం బంగారం, మొబైల్‌ ఫోన్‌ కొనుక్కెళ్లాడు కృష్ణమోహన్. కొంత నగదు కూడా ఇచ్చాడు. పెళ్లిపేరు చెప్పి కృష్ణమోహన్‌ దగ్గర రూ.6 లక్షలు కాజేశారు. తర్వాత కృష్ణమోహన్‌తో తెగదెంపులు చేసుకున్నారు. దీంతో కృష్ణమోహన్‌ పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లికూతురు నీరజ అలియాస్ చిన్ని గురించి ఆరా తీస్తే.. ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయిందని, పాప కూడా ఉందని పోలీసులకు చెప్పాడు. పెళ్లి పేరుతో జరిగిన మోసంపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కూడా ఆశ్రయించాడు. వయస్సు దాటిపోయినా పెళ్లి జరుగుతుందని ఆశ పడ్డానని, తన డబ్బులను తనకు ఇప్పించాలని బాధితుడు వేడుకున్నాడు. పెళ్లి పేరుతో తనను ఎలా మోసం చేశారో వివరించాడు కృష్ణమోహన్. ముఠాలో మొత్తం 11 మంది ఉన్నారని తెలిపాడు. అందులో ఆరుగురు మహిళలు కాగా.. ఐదుగురు పురుషులు ఉన్నారని వివరించాడు.

Read Also: Uttar Pradesh: బాలికపై అత్యాచారం.. ఎస్పీ నేత అరెస్ట్‌

తన కుటుంబసభ్యులు లేకపోవడం వల్ల ఎంగేజ్‌మెంట్‌కు స్నేహితులను తీసుకెళ్లినట్టు బాధితుడు కృష్ణమోహన్ చెప్పాడు. జూన్‌ 23న జరిగిన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను చూపిస్తున్నాడు. పెళ్లి పేరుతో మోసం కేసులో వధువు పాత్ర పోషించిన నీరజ అలియాస్ చిన్ని కూడా కౌంటర్ కేసు పెట్టింది. కాకినాడ ఎస్పీ ఆఫీసులో కృష్ణమోహన్‌పై ఫిర్యాదు చేసింది. మధ్యవర్తి శిరీష తమను మోసం చేసిందని అంటోంది. కృష్ణమోహన్‌తో తనకు పెళ్లి ఇష్టం లేదని.. బంధువుల ఇంటికి వస్తే బలవంతంగా ఎంగేజ్‌మెంట్‌ చేశారని నీరజ అంటోంది. కృష్ణమోహన్‌ చెప్పినట్లు తనకు పెళ్లి కాలేదని.. ఇక పిల్లలు ఎలా ఉంటారని ప్రశ్నిస్తోంది. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత కృష్ణమోహన్‌ తనకు చాలా సార్లు ఫోన్‌ చేసి సింగిల్‌గా కలుద్దామని బెదిరించాడని ఆరోపించింది. కృష్ణమోహన్‌ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదని అంటోంది నీరజ అలియాస్ చిన్ని. కృష్ణ మోహన్‌ ఫిర్యాదు మేరకు ఆరుగురు మహిళలపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనలా చాలా మందిని ఈ ముఠా మోసం చేసిందని అంటున్నాడు కృష్ణ మోహన్‌. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నాడు. మొత్తానికి లేటు వయస్సు పెళ్లి కొడుకును మోసం చేసిన ఈ ముఠా కేసును పోలీసులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.