Father Murder Case: ఆస్తి, డబ్బు ముందు బంధాలు, బంధుత్వాలు చిన్నబోతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది. ఆస్తి కోసం సొంత తండ్రినే చంపేశాడు కొడుకు. తండ్రి అంటే గౌరవం లేదు సరికదా.. కనీసం వృద్దుడు అనే జాలి కూడా లేకుండా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు దుర్మార్గుడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
READ ALSO: Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!
ఆ వ్యక్తి పేరు నన్నే సాబ్. కర్నూలు జిల్లా కుంటనహల్ స్వగ్రామం. ఆయన గతంలో సర్పంచ్‌గా పని చేశాడు. నన్నే సాబ్‌కు గౌసియా అనే మహిళతో వివాహమైంది. వారికి నూర్ బాషా, జానెద్ బాషా, మరో కూతురు పుట్టారు. నన్నేసాబ్ , గౌసియా మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇద్దరూ పదేళ్ల క్రితం విడిపోయారు. ఆ తర్వాత గౌసియా రెండవ వివాహం చేసుకుంది. గౌసియా విడాకులు తీసుకున్నా.. పిల్లలు నూర్ బాషా, జానెద్ బాషా, కూతురు తండ్రి వద్దే ఉంటున్నారు. వారికి ఇంకా పెళ్లికాలేదు. నూర్ బాషా పనిలేకుండా మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. నన్నే సాబ్ కూడా భార్యకు విడాకులిచ్చిన తర్వాత రెండేళ్లకు హసీనా అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. 8 ఏళ్లయినా వారికి పిల్లలు కాలేదు. రెండవ భార్య హసీనా ఇపుడు గర్భవతిగా ఉంది. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది.
నన్నే సాబ్ రెండవ వివాహం చేసుకున్నా మొదటి భార్య పిల్లలతో ఎలాంటి ఆస్తి గొడవలు రాలేదు. రెండవ భార్య హసీనా గర్భం దాల్చడంతో ఆస్తి రాకుండా పోతుందేమోనని మొదటి భార్య కుమారుడు నూర్ బాషా తరచూ గొడవ పెట్టుకుంటున్నాడు. నన్నే సాబ్‌కి ఐదుగురు అన్నదమ్ములు. ఇంకా ఆస్తులు.. పొలాలు పంచుకోలేదు. పెద్ద భార్య కుమారుడు ఆస్తి అడిగితే.. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న తరువాత రావలసిన భాగం ఇస్తామని నూర్ బాషాకి తండ్రి చెప్పాడు. కానీ నూర్ బాషా వినిపించుకోలేదు. 3 రోజుల క్రితం ఇదే విషయంపై పెద్దమనుషుల మధ్య పంచాయితీ కూడా చేశారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న తరువాత ఇస్తామంటే.. నూర్ బాషా ఒప్పుకున్నాడు. అంతలోనే రాత్రి అందరూ పడుకున్న తరువాత తండ్రి నన్నే సాబ్‌ని కత్తితో పొడిచి చంపాడు నూర్ బాషా. తండ్రిని చంపేస్తే ఆస్తి వస్తుందని మద్యం మత్తులో గొంతుకోసి హత్య చేశాడు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మొత్తానికి మద్యం మత్తులో ఆస్తి కోసం కన్న తండ్రినే చంపేశాడు నూర్ బాషా. ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుపాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన హత్య కారణంగా.. ఆస్తి రావడం కాదు కదా ఇప్పుడు జీవితం కూడా దిక్కుతోచని స్థితిలో పడింది.
READ ALSO: Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?