Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!

Tdp

Tdp

AP Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, మేయర్‌ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. ఆశావహుల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసేందుకు ఐవీఆర్ఎస్‌ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఫోన్ కాల్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫలితాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పదవి కోసం శారదమ్మ, వెంకటేష్, రాజ్‌కుమార్, కన్నన్, ప్రశాంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో మాజీ జడ్పీటీసీ రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేష్ తమకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి అభ్యర్థులపై అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కొన్ని కాల్స్‌లో ఇద్దరు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రస్తావించి ప్రజల అభిప్రాయాలను అడుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వేర్వేరు కాల్స్‌లో అభ్యర్థుల పేర్ల క్రమం మారుతుండటంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు చేపట్టినట్లు చెబుతున్న ఈ సర్వే ఫలితాలు అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారతాయా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు కౌన్సిలర్ టికెట్ల కోసం కూడా ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో వార్డు నుంచి పార్టీ తరఫున ఒక్కరినే బరిలో నిలిపేలా ఏకాభిప్రాయం సాధించేందుకు టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వార్డులవారీగా పోటీని తగ్గించి పార్టీ విజయావకాశాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

చిత్తూరు నగర మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ టీడీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగిస్తోంది. చివరి దశకు చేరినట్లు చెబుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలో కఠారి హేమలత, కాజూరి ద్రాక్షాయణి, త్యాగరాజన్ పేర్లను ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. మేయర్ స్థానం బీసీలకు రిజర్వు కావడంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. సర్వేలో సీకే లావణ్య పేరు లేకపోవడంపై నగరంలో చర్చ జరుగుతోంది. మరోవైపు బలిజ సామాజికవర్గానికి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ కొందరు నిరసనలు, ప్రెస్‌మీట్లు నిర్వహించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థి ఎంపిక అంశం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

మేయర్ టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ఎమ్మెల్యే గురజాలను కలిసినట్లు తెలుస్తోంది. అశోక్ ఆనంద్ యాదవ్, సీఆర్ రాజన్, శంకర్ తదితరులు కూడా అభ్యర్థిత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. కుప్పంలో ఐదుగురు నేతల పేర్లు పరిశీలనలో ఉండగా, చిత్తూరు మేయర్ పదవికి ముగ్గురు పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతున్నట్లు సమాచారం. ప్రజాభిప్రాయం, సామాజిక సమీకరణాలు, స్థానిక నేతల అభిప్రాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.