Site icon NTV Telugu

Kuldeep Yadav: కష్టాన్నే నమ్ముకున్న కుల్దీప్.. ఒక్కమాట అనలేదు! చివరకు బెండు తీశాడు

Kuldeep Yadav Comeback

Kuldeep Yadav Comeback

చైనామన్‌ బౌలర్ కుల్దీప్ యాదవ్ గత ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ప్రతి టీమిండియా స్క్వాడ్‌లోనూ ఉంటున్నా.. తుది జట్టులో మాత్రం అవకాశం రావడం లేదు. 2025 ఆరంభంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యాడు. ఐదు టీ20ల్లో ఒక్కసారి కూడా ఛాన్స్‌ రాలేదు కానీ.. రెండు వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత దుబాయ్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఆడిన కుల్దీప్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై అతడు ఒక్క టెస్ట్ మ్యాచ్‌ కూడా ఆడలేదు.

ఆరు నెలలుగా బెంచ్‌కే పరిమితం అయినా కుల్దీప్ యాదవ్ నిరాశ పడలేదు, కుంగిపోలేదు. ఇదే పరిస్థితిలో మరో సీనియర్ ప్లేయర్ అయితే తన అసహనాన్ని ఎక్కడో ఓ చోట కచ్చితంగా వ్యక్తం చేసేవాడే. కానీ కుల్దీప్ అలా చేయకుండా.. కష్టాన్నే నమ్ముకున్నాడు. మరింత ఎక్కువ ప్రాక్టీస్‌ చేశాడు. ఎట్టకేలకు ఆసియా కప్‌ 2025 రూపంలో అతడికి అవకాశం వచ్చింది. దుబాయ్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలం కావడంతో అతడికి ఛాన్స్‌ ఇవ్వక మేనేజ్మెంట్‌కు తప్పలేదు. వచ్చిన అవకాశాన్ని కుల్దీప్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. యూఏఈపై సత్తాచాటాడు. 13 బంతులే సంధించిన కుల్దీప్.. 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Also Read: Boycott Asia Cup: టీమిండియా ఆటగాళ్లపై గౌరవం పోయింది.. బాయ్‌కాట్‌ ఆసియా కప్!

యూఏఈపై ఒకే ఓవర్‌లో మూడు వికెట్స్ తీయడం అద్భుతమనే చెప్పాలి. ఈ ప్రదర్శనతో తనలో మాయాజాలం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. సాధారణంగా పవర్‌ ప్లే ముగిసిన తర్వాత బ్యాటర్లు ఎక్కువగా హిట్టింగ్ చేయడానికి ముందుకు రారు. కుల్దీప్ మాత్రం ఊరించేలా బంతులు వేస్తూ బుట్టలో వేస్తాడు. కుల్దీప్ ప్రధాన అస్త్రం ఫ్లైటెడ్ డెలివరీ. సహచర స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ జట్టులో చోటు కోల్పోగా.. కుల్దీప్ మాత్రం సత్తాచాటుతున్నాడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌లోనూ కుల్దీప్ టీమిండియాకు ప్రధాన అస్త్రం కానున్నాడు.

Exit mobile version