Hyderabad: కూకట్‌పల్లిలో భారీ సైబర్ మోసం.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 12.31 కోట్లు స్వాహా..

Cyber Scam

Cyber Scam

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ యువ వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు భారీ టోకరా వేశారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాల ఆశ చూపి, వ్యాపారి దిలీప్ నుంచి ఏకంగా రూ. 12.31 కోట్ల పైచిలుకు నగదును కొట్టేశారు. ప్రగతినగర్‌కు చెందిన 35 ఏళ్ల వ్యాపారి దిలీప్ తమ్మిరెడ్డి ఈ భారీ సైబర్ మోసానికి బలయ్యారు. మార్చి 2న అర్జున్ అనే వ్యక్తి వాట్సాప్ ద్వారా దిలీప్‌కు పరిచయమై, ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ ద్వారా ఆయన వివరాలు సేకరించాడు. తాను ట్రేడింగ్ నిపుణుడినని నమ్మబలికి, తక్కువ కాలంలోనే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. ముందుగా కేవలం రూ. 10 వేలతో పెట్టుబడి పెట్టించాడు.

మొదట్లో కొంత లాభం వచ్చినట్లు ఖాతాలో చూపించడంతో సైబర్ నేరగాళ్ల మాటలను దిలీప్ పూర్తిగా నమ్మారు. దీంతో మరింత లాభం పొందాలనే ఉద్దేశంతో నిందితులు చెప్పిన పలు బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా మొత్తం రూ. 12.31 కోట్లను బదిలీ చేశారు. ఆ తర్వాత తన డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు అదనపు పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. దీంతో తాను దారుణంగా మోసపోయినట్లు దిలీప్ గ్రహించారు. బాధితుడు దిలీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు స్పందించారు. నిందితులపై బీఎన్‌ఎస్ (BNS) 318(4), 319(2), ఐటీ చట్టం 66డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.