Site icon NTV Telugu

KTR Tweet: దరఖాస్తులు తప్పితే దమ్మిడీ ఇచ్చింది లేదు.. కేటీఆర్‌ ట్వీట్ వైరల్!

Ktr

Ktr

KTR Slams Congress Over Rythu Bima Renewal Rules: ‘రైతు బీమా’ పథకం పునరుద్ధరణకు గడువు దగ్గరపడింది. 2024-25 బీమా గడువు ఆగష్టు 13తో ముగుస్తుండగా.. 2025-26కి ప్రీమియం చెల్లిస్తే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. రైతు బీమా పథకంలో చేరే రైతులు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. రైతులు తమతో పాటు నామినీకి చెందిన ఆధార్‌ కార్డు, పట్టా పుస్తకం దరఖాస్తుకు జతచేసి స్వయంగా వ్యవసాయశాఖ అధికారులకు ఇవ్వాలి. అర్జీలకు మరో మూడు రోజులే గడువు ఉండడంతో.. రైతులు తమ పనులు మానుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రభుత్వంపై కౌంటర్ వేశారు. కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుందని, ఒక్క పథకమూ అమలు కావడం లేదన్నారు.

‘తిక్కలోడు తిరనాళ్లకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందని.. అసమర్ద, అవివేక కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఒక్క పథకమూ నిర్ధిష్టంగా అమలు కావడం లేదు. భూమిని నమ్ముకున్న రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందించే రైతుబీమా పథకం 2018 నుండి కేసీఆర్ గారి ప్రభుత్వం అమలుచేస్తూ వస్తున్నది. పథకం ప్రారంభించినప్పటి నుండి 2023 డిసెంబర్ వరకు 1,11,320 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా జాప్యం చేయడం మూలంగా వేలాది మంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతు స్వయంగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు అందజేయాలని నిబంధన పెట్టారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.

Also Read: Hydra: హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం!

‘రైతుబీమా రెన్యువల్‌కు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నది. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా నడుస్తున్నాయి. ఎరువులు దొరక్క రైతులు చెప్పులు, బుక్కులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో రైతుబీమాకు తిరిగి స్వయంగా రైతులు దరఖాస్తు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మూర్ఖత్వం. గతంలో చేసినట్లే రైతుబీమా రెన్యువల్ చేయాలి. దరఖాస్తు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ప్రతిపక్షాలు, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఎవరి మీద విసురుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దండగమారి కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తప్పితే సామాన్యులకు ఈ సర్కారు దమ్మిడీ విదిల్చింది లేదు. బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప 20 నెలల కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు, తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. జాగో తెలంగాణ జాగో’ అంటూ కేటీఆర్ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Exit mobile version