KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ktr

Ktr

సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని, పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తాము సభలో ఎలాంటి అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదని, రాహుల్ గాంధీ తరహాలోనే టీ-షర్టులతో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కేసీఆర్ తమకు సూచించారని, కానీ రేవంత్ రెడ్డి ఆయన పోలీస్ బృందంతో కలిసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారని మండిపడ్డారు.

సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి అజాతశత్రువులైన మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, పోలీసు బలగం దుర్మార్గమైన చర్యలను ప్రజలంతా గమనించారని అన్నారు. ఈ దాడి వెనుక ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి హస్తమే ఉందన్న కేటీఆర్, టీ-షర్టులపై అభ్యంతరకర పదాలు ఉన్నాయనడానికి డీసీపీ శిల్పవల్లి ఎవరని ప్రశ్నించారు. ఏ రూల్ ప్రకారం తమను అడ్డుకున్నారో చెప్పకుండా, రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారనే నెపంతోనే ఈ అడ్డంకులు సృష్టించారని ధ్వజమెత్తారు. శాసనసభను దుశ్శాసన సభగా మార్చేశారని, ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.

స్పీకర్ స్థానంలో ఉండి వివక్ష చూపించడం తగదని, సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వబోమనడం సరికాదని హితవు పలికారు. గలాటాకు ఆద్యుడైన ముఖ్యమంత్రి నిరసనకారులకు, మహిళా నేతలకు క్షమాపణ చెప్పే వరకు సభలో నిలదీస్తామని తేల్చిచెప్పారు. నాడు డి.కె. అరుణకు తాము క్షమాపణ చెప్పిన విషయాన్ని, తాతా మధు విచారణ వ్యక్తం చేయాలని కేసీఆర్ ఆదేశించిన అంశాన్ని గుర్తుచేశారు. దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

సభలో బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, ఈ దాడికి నిరసనగా తాము బీఏసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరామని, కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తే అవసరమైతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు.