NTR with Krishna: యన్టీఆర్ అడుగుజాడల్లో కృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR with Krishna: చిన్నతనం నుంచీ నటరత్న యన్టీఆర్ ను అభిమానిస్తూ వచ్చిన కృష్ణ చిత్రసీమలో అడుగుపెట్టాక కూడా ఆయన చూపిన బాటలోనే పయనించారు. తెలుగు సినిమా రంగం తొలి రోజుల్లో ఏడాదికి ఒకటి, రెండు చిత్రాలు- ఆ పై సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చూసింది. యన్టీఆర్ చిత్రసీమలో అడుగు పెట్టిన తరువాత నుంచీ సంఖ్య పెరిగింది. ‘మనముంటున్న సినిమారంగాన్ని కాపాడుకోవడం మన విధి’ అంటూ యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ విశ్వసించేవారు. తదనుగుణంగానే వారిద్దరూ ఏడాదికి ఐదారేసి చిత్రాలు చేస్తూ సాగారు. యన్టీఆర్ పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాల్లో నటిస్తూ ఏడాదికి పది సినిమాలు, అంతకు పైగా చేసిన సందర్భాలూ ఉన్నాయి. కృష్ణ సైతం అదే పంథాలో పయనిస్తూ సంవత్సరానికి పది సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఓ యేడాది 15 చిత్రాల్లోనూ కృష్ణ నటించారు. తన తరువాతి తరం హీరోలయిన కృష్ణ, శోభన్ బాబుకు యన్టీఆర్ పదే పదే ఎక్కువ చిత్రాల్లో నటించడం వల్ల మనలను నమ్ముకున్న కుటుంబాలకు మేలు చేసిన వారమవుతామని చెప్పేవారు. దానిని కృష్ణ, శోభన్ ఇద్దరూ తు.చ. తప్పక పాటించారు.
యన్టీఆర్ ను అభిమానించడమే కాదు, ఆయనలాగా మాస్ ను ఆకట్టుకోవాలన్నదే కృష్ణ ధ్యేయంగా మారింది. అందుకోసం వెస్టరన్ స్టైల్ లో కౌబోయ్, సీక్రెట్ ఏజెంట్ మూవీస్ లో నటిస్తూ కృష్ణ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. సదరు చిత్రాలను అభిమానించేవారిని తనవైపు తిప్పుకోగలిగారు. యన్టీఆర్ తన సోదరుడు యన్.త్రివిక్రమరావు నిర్మాతగా తమ యన్.ఏ.టి. పతాకంపై పలు మరపురాని చిత్రాలు నిర్మించి, విజయం సాధించారు. కృష్ణ సైతం అదే రూటులో సాగుతూ, తన తమ్ముళ్లు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నిర్మాతలుగా తమ పద్మాలయా పతాకంపై జనరంజకమైన చిత్రాలు నిర్మించి అలరించారు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
యన్టీఆర్ తన 200వ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ లో నిర్మించారు. ఆ సినిమా పేరు ‘కోడలు దిద్దిన కాపురం’. 1970లో విడుదలైన ఈ చిత్రం ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. యన్టీఆర్ అప్పటికే సూపర్ స్టార్ అయినా, టైటిల్ తన పేర ఉండాలని భావించలేదు. పైగా తన సొంత చిత్రమే అయినా, టైటిల్ ను ‘కోడలు’ పేరుతో ఆరంభించడం విశేషం! ఇదే రీతిన కృష్ణ కూడా తన 200వ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ లో నిర్మించారు. టైటిల్ తన పేర ఉండకుండా ‘ఈనాడు’అని పెట్టారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
ఇక యన్టీఆర్ తన నటవారసునిగా తొలుత హరికృష్ణను తాను నటించిన ‘శ్రీకృష్ణావతారం’ (1967)తో పరిచయం చేశారు. ఆ తరువాత బాలకృష్ణను తన ‘తాతమ్మకల’ (1974) ద్వారా తెరపై తళుక్కుమనిపించారు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న కృష్ణ తన వారసునిగా పెద్ద కొడుకు రమేశ్ ను ‘మోసగాళ్ళకు మోసగాడు, దొంగలకు దొంగ, కురుక్షేత్రం’ వంటి చిత్రాలలో నటింప చేశారు. ఆ తరువాతే హీరోగా ‘సామ్రాట్’తో రమేశ్ ను జనం ముందు నిలిపారు. అలాగే చిన్న కొడుకు మహేశ్ ను తన ‘పోరాటం’ చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆపై తనతో పలు చిత్రాల్లో నటింప చేస్తూ వచ్చారు. యన్టీఆర్ నటవారసుల్లో బాలకృష్ణ జయకేతనం ఎగురవేయగా, కృష్ణ వారసుల్లో ఇప్పుడు మహేశ్ బాబు జైత్రయాత్ర సాగిస్తున్నారు.
యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సీతారామకళ్యాణం’ అనే పౌరాణికం తెరకెక్కించారు. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో అనేక మరపురాని చిత్రాలు జనం ముందు నిలిచాయి. కృష్ణ కూడా తాను ఏదో ఒకరోజున దర్శకత్వం వహించాలని తపించారు. తన 100వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్ర దర్శకుడు వి.రామచంద్రరావు కన్నుమూయగా, ఆ చిత్రాన్ని తానే పూర్తి చేశారు. ఆ తరువాత 1986లో తొలిసారి దర్శకత్వం వహిస్తూ ‘సింహాసనం’ అనే జానపద చిత్రాన్ని రూపొందించారు. ఆ పై కృష్ణ దర్శకత్వంలోనూ కొన్ని చిత్రాలు రూపొంది అలరించాయి. తన తనయులతో కలసి యన్టీఆర్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో “తాతమ్మకల, దానవీరశూర కర్ణ” వంటి చిత్రాలు రూపొందించారు. కృష్ణ తన నటవారసులైన రమేశ్, మహేశ్ తో కలసి స్వీయ దర్శకత్వంలో ‘ముగ్గురు కొడుకులు’లో నటించారు.
తెలుగునాట త్రిపాత్రాభినయం చేసిన తొలి నటునిగా ‘కులగౌరవం’తో యన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఆ తరువాత ‘దానవీరశూర కర్ణ’లోనూ ఆయన త్రిపాత్రాభినయం చేసి అలరించారు. అదే తీరున కృష్ణ కూడా “కుమారరాజా, పగబట్టిన సింహం, డాక్టర్ సినీయాక్టర్, రక్తసంబంధం” వంటి చిత్రాలలో త్రిపాత్రాభినయం చేసి అభిమానులకు ఆనందం పంచారు. యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలను పోలిన కథలతోనే కృష్ణ కొన్ని సినిమాల్లో సాగడం విశేషం! ముఖ్యంగా యన్టీఆర్ కుటుంబ కథాచిత్రాలయిన “ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం” వంటి చిత్రాలలాగే తమ “పండంటి కాపురం, పాడిపంటలు” మొదలైన సినిమాలను రూపొందించారు.
యన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని స్థాపించి, రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కేవలం తొమ్మిది నెలలకే 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణ సైతం రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని 1984లో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ తెలుగునాట విజయకేతనం ఎగురవేయలేకపోయినా, 1989లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధించింది. ఆ సమయంలో ఏలూరు పార్లమెంట్ నుండి కృష్ణ పోటీ చేసి గెలిచారు. యన్టీఆర్ మరణం తరువాత కృష్ణ సైతం ఎందుకనో రాజకీయాలపై అంతగా ఆసక్తి కనబరచలేదు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!