NTV Telugu Site icon

AP Inter Results: ఇంటర్‌లో సత్తా చాటిన కృష్ణా జిల్లా.. మే నెలలోనే పది ఫలితాలు

Krishna District

Krishna District

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కృష్ణా జిల్లా సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా కృష్ణా నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 77 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 83 శాతం ఉత్తీర్ణత కృష్ణా జిల్లాలో నమోదైంది. మొదటి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం బాలికలు 85 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో చివరి స్థానంలో విద్యా శాఖ మంత్రికి చెందిన జిల్లా విజయనగరం నిలిచింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో చివరి స్థానంలో కడప జిల్లా నిలిచింది. ఇదిలా ఉండగా.. విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read Also: AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే టాప్

ఇంటర్ పాసైన పిల్లలను ట్రాక్ చేస్తున్నామని.. ఉన్నత విద్యలో జాయిన్ అయ్యారా లేదా అన్నది చూస్తున్నామని మంత్రి తెలిపారు. మే నెలలో పదవ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యత బోధనే అని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులపై అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలిస్తామన్నారు. పిల్లలను ఎక్కడ చదివించాలన్నది తల్లిదండ్రుల ఇష్టమని మంత్రి చెప్పారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ స్కూళ్లు ధీటుగా ఉండేలా తయారు చేయటం ప్రభుత్వ అభీష్టమని ప్రకటించారు.

ఈ నెల 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని మంత్రి చెప్పారు. ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.