T20 World Cup: ‘కూతురి కల కోసం నగలు అమ్మిన తల్లి’.. ఇండియన్ ప్లేయర్ కళ్లలో మెరిసిన భావోద్వేగపు సంతకం..

Kranthi Goud

Kranthi Goud

భారత మహిళా క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ తాను ఈ స్థాయికి చేరడానికి తన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్, మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లో అద్భుతంగా రాణించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకు ఒక క్రికెట్ కిట్ కొనివ్వడం కోసం తన తల్లి ఏకంగా తన నగలను అమ్ముకుందని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ త్యాగమే తనలో బాధ్యతను పెంచిందని, కుటుంబం అండగా ఉంటే బయటి ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. చాలా మంది అమ్మాయిలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వని రోజుల్లో, తన కుటుంబం తన కలలపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిందని, అందుకే తనకు నిలకడగా ఆడే శక్తి లభించిందని తెలిపారు. ఆమె సాధించిన విజయంతో ఇప్పుడు వారి గ్రామంలో ఒక క్రికెట్ అకాడమీ కూడా ప్రారంభమైందని, ఎంతోమంది అమ్మాయిలు క్రీడల వైపు అడుగులు వేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

×
×
Ad

ఇటీవల మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో క్రాంతి గౌడ్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. సౌతాఫ్రికా ప్లేయర్ మారిజానే కాప్ లభించిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుని 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

దీంతో భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ కాప్ రెండు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. భారత ఫీల్డర్ రాధా యాదవ్ రెండు సార్లు కాప్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడం మ్యాచ్ మలుపు తిప్పింది. అయితే, భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణి 4 ఓవర్లలో ఒక మెయిడెన్‌తో కేవలం 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేసింది. అయినా జట్టును గెలిపించలేకపోయింది. ఈ ఓటమిని పక్కనబెట్టి, రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని భారత జట్టు భావిస్తోంది.