Konda Surekha: హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ జంట విడిపోడానికి కేటీఆరే కారణమని మాజీ మంత్రి కొండా సురేఖ గతంలో ఆరోపణలు చేసి విషయం తెలిసిందే. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే.. తాజాగా ఈ అంశంపై కొండా సురేఖ మరోసారి స్పందించారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు. ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.. నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది.. కేటీఆర్, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశం లేదు.. కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం లేదు.. నా వ్యాఖ్యలతో వారిని నొప్పించి ఉంటే అందుకు చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ కొండా సురేఖ ట్వీట్‌లో స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.
ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.
కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు.
నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.
— Konda Surekha (@iamkondasurekha) October 29, 2026

