Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!

  • రాఖీ పౌర్ణమి సందర్భంగా..
  • రాఖీ కట్టిన మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క.
  • జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుక..
Konda Surekha

Konda Surekha

Konda Surekha: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మంత్రి కొండా సురేఖ, మరో మహిళా మంత్రి సీతక్క రక్షాబంధన్ కట్టారు. అనంతరం మంత్రి కొండా సురేఖ రాఖీ పండుగ ప్రాధాన్యతతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో తన అనుబంధంపై మాట్లాడారు.

రాఖీ పండుగ అంటే అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భరోసా, ఆత్మీయత, ప్రేమ, అనురాగం, గౌరవానికి ప్రతీక అని కొండా సురేఖ అన్నారు. మహిళ జీవితంలో తండ్రి, సోదరుడు, భర్త, కొడుకు వంటి పురుషుల భాగస్వామ్యం ఉంటుందని.. వారి నుంచి లభించే రక్షణ, భరోసా మహిళకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అన్న, తమ్ముడిపై నమ్మకంతో రాఖీ కట్టి.. తనకు రక్షణగా ఉండాలని కోరుకోవడమే రక్షాబంధన్‌లోని ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

రాఖీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని కొండా సురేఖ తెలిపారు. తెలంగాణలో మహిళలందరి తరఫున ఆయనకు తమ ఆశీర్వాదం ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ “నన్ను సపరేట్ చేయకండి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలోని ప్రతి ఆడపడుచుకు ప్రతినిధినని, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల మహిళలకు సీఎం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇటీవల కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పరకాల అసెంబ్లీ సీటు విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపించాయి. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లు కొండా సురేఖ కుటుంబంపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి స్వయంగా రాఖీ కట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.