Site icon NTV Telugu

DC vs KKR: 166 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం

Dc Vs Kkr

Dc Vs Kkr

DC vs KKR: విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. 106 పరుగుల తేడాతో మరపురాని విజయాన్ని సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్‌ నరైన్‌ 85, రఘువంశీ 54, రస్సెల్ 41 పరుగులతో చెలరేగడంతో కోల్‌కతా భారీ స్కోరును నమోదు చేసింది. మొదట సునీల్ నరైన్, ఆ తర్వాత ఆంగ్ క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్… ఇలా ప్రతి ఒక్కరూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. మరో 6 పరుగులు చేసుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ రికార్డు తెరమరుగయ్యేది. అనంతరం 273 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్లలో రిషబ్‌ పంత్(55), ట్రిస్టన్‌ స్టబ్స్‌ మినహా ఎవరూ రాణించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ అరోరాలు తలో మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రస్సెల్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

కోల్‌కతా బ్యాటింగ్ విషయానికొస్తే… ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసక ఆటతీరుతో మొదట్లోనే ఢిల్లీ బౌలింగ్‌ను అతలాకుతలం చేశాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు రఘువంశీ చిచ్చరపిడుగులా ఆడి 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు సాధించాడు. రసెల్ 19 బంతుల్లో 41, రింకూ సింగ్ 8 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్కియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్ 1, మిచెల్ మార్ష్ 1 వికెట్ తీశారు.

Exit mobile version