ఏపీలో గత కొన్ని రోజులుగా రాజకీయం వేడెక్కింది. విశాఖ గర్జన తరువాత చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మొదలు ఇప్పటివరకు వరుసగా జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే.. నిన్న గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామంలో అక్రమంగా ఇళ్లను కూల్చివేశారని, తన సభకు స్థలం ఇచ్చిన వారిని టార్గెట్ చేసి ఇళ్లను కూల్చేశారంటూ పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే నేడు ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించి వైసీపీ ప్రభుత్వంపై తారాస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Brutally Thrashing : గదిలో విద్యార్థిని బంధించి క్రూరంగా దాడి.. నలుగురు విద్యార్థులు అరెస్ట్..
అంతేకాకుండా.. తాగుబోతులు గొడవ చేస్తే పవన్ కల్యాణ్‌పై రెక్కీ చేశారని జనసేన ఆరోపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గులకరాయితో బాబుపై హత్యాయత్నం జరిగిందట.. అంటూ నిన్న చంద్రబాబు కాన్వాయ్ ఘటనపై విమర్శలు చేశారు కొడాలి నాని. టీడీపీ, జనసేన పార్టీలు డ్రామాలు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో రెక్కీ జరిగినా.. రష్యాలో పవన్ షూటింగ్‌లో ఉన్నప్పుడు రెక్కీ జరిగినా జగన్‌కు సంబంధమా అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేఏ పాల్‌ను మించి హడావుడి చేయాలని ఇప్పటంలో పవన్ ట్రై చేశారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. విపక్షాలు నిర్మాణాత్మకంగా ఒక్క సలహా అయినా ఇచ్చాయా అంటూ ఆయన దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞాని అన్న కొడాలి నాని.. కేఏ పాల్‌తో పవన్ పోటీపడుతున్నారన్నారు.
