NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ జట్టుకు భారీ షాక్..

Kl Rahul

Kl Rahul

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో ఆటగాడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపింది. కేఎల్ రాహుల్, అతని భార్య బాలీవుడ్ నటి అతియా శెట్టి 2024 నవంబర్‌లో తమ తొలి బిడ్డను ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రాహుల్ ప్రస్తుత సమయాన్ని కుటుంబానికి కేటాయించే అవకాశం ఉందని హీలీ పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్ LSTNR స్పోర్ట్ లో మాట్లాడిన ఆమె, “రాహుల్ మొదటి రెండు మ్యాచ్‌లు మిస్ కావొచ్చు.. అతను జట్టుకు చాలా విలువైన ఆటగాడు. టీ20 క్రికెట్‌లో అతని అనుభవం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఉపయోగపడుతుంది” అని తెలిపింది.

Read Also: Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?

గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌గా ఉన్న రాహుల్‌ను ఢిల్లీ రూ.14 కోట్లకు వేలంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.. అయితే, అందరూ రాహుల్‌నే జట్టు కెప్టెన్‌గా భావించినప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ అతని స్థానంలో అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీంతో.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఒత్తిడికి గురికాకుండా, పూర్తిగా తన బ్యాటింగ్‌పై దృష్టి సారించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రాహుల్ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయించాలి..

కేఎల్ రాహుల్ గతంలో స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున కీలక ఇన్నింగ్స్ ఆడి విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. దీంతో.. ఈసారి ఐపీఎల్‌లో రాహుల్ పూర్తిగా కొత్త ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టనున్నాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ తన కొత్త జట్టులో ఎలా రాణిస్తాడో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. అతని బ్యాటింగ్ స్టైల్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? స్ట్రైక్ రేట్ విషయంలో తనపై ఉన్న విమర్శలను తిప్పికొట్టగలడా? ఇవన్నీ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రశ్నలు.