NTV Telugu Site icon

Kishan Reddy: బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి..

Kishanreddy

Kishanreddy

బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృ‌షిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం కోల్‌కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి.. అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. భారతదేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సీఐఎల్ పోషిస్తున్న పాత్రను అభినందించిన కిషన్ రెడ్డి.. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.

Read Also: Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..

దేశీయ అవసరాలకు కొత్త బ్లాకులను గుర్తించడం బొగ్గు ఉత్పత్తిని చేపడుతూనే.. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు. అనంతరం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. దేశంలో కాపర్ ఎక్స్‌ప్లొరేషన్లో పనిచేస్తున్న ఏకైక సంస్థ అయిన HCL రానున్న రోజుల్లో దేశీయ అవసరాలకు తగ్గట్లుగా మరింత ఉత్పత్తిని పెంచడంపై పనిచేయాలన్నారు. GSI కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని సంస్థ సాధించిన ప్రగతిని.. రానున్న రోజుల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

Read Also: RBI: మైక్రోసాఫ్ట్‌ సమస్యపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

తదనంతరం GSI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ను కేంద్రమంత్రి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కొండప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల జరుగుతున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ముందుగానే వీటిని గుర్తించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. సానుకూల ఫలితాలు వచ్చాయని రానున్న రోజుల్లో ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు. అనంతరం కేంద్రమంత్రి కోల్‌కతా నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. రేపు (శనివారం) నగరంలో జరగనున్న క్రిటికల్ మినరల్ హ్యాకథాన్ & రోడ్ షో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిచనున్నారు.