Site icon NTV Telugu

Kishan Reddy : ఎన్నికల ఎత్తుగడలో కొంతవరకు విఫలమయ్యాం

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలందరూ ఎంతో కష్టపడ్డారని, ఎన్నికల్లో నరేంద్ర మోదీ నీ బిజెపి ని ఓడించాలనీ దేశ వ్యాప్తంగా కొన్ని అంతర్జాతీయ శక్తులు కుట్ర చేశాయన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని రెండు నియోజకవర్గాల్లో బిజెపి వ్యతిరేక శక్తులు (కాంగ్రెస్, ఎంఐఎం) ఏకమయ్యాయని, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (జూబ్లీహిల్స్, నాంపల్లి) బీజేపీకి మెజారిటీ రాలేదని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో మజ్లిస్ పార్టీ పోటీచేసింది. కాంగ్రెస్ పార్టీ గుర్తు కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద మజ్లిస్ పార్టీ పనిచేసింది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎంతో అవగాహనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారమే నిర్వహించలేదు. పాదయాత్ర చేయలే.. సమావేశాలు నిర్వహించలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఎన్నికల ఎత్తుగడలో కొంతవరకు విఫలమయ్యాం. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 62 వేల ఓట్లు తగ్గాయి. ఆ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. అయినా ప్రజల మద్దతుతో బీజేపీకి గతం కంటే ఓటింగ్ శాతం పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారిపై ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు ఆదరిస్తున్నారు. దీన్ని రాజకీయంగా జీర్ణించుకోలేని కొన్ని శక్తులు కుట్రలకు తెరలేపాయి. వికసిత్ భారత్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తులు చాపకింద నీరులాగా పనిచేస్తున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, హ్యాట్రిక్ ప్రధానిగా పదవి అలంకిరించిన ఘనత నరేంద్ర మోదీదే’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version