Site icon NTV Telugu

Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!

Kishan Reddy

Kishan Reddy

Minister Kishan Reddy: విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అసాధారణ పురోగతి సాధించిందని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన “మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధి ” కార్యక్రమాలపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇంకా బీజేపీ నేతలు దేశ అభివృద్ధికి మోడీ పాలన ఎంత కీలకమైందో వివరించారు.

Read Also: Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..!

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. పేద, అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా మోడీ పాలన ఉండిందని అన్నారు. రైతులు, యువత, మహిళలు ఈ నాలుగు ప్రధాన విభాగాల అభివృద్ధి కోసమే ప్రతి కార్యక్రమం రూపకల్పన చేశారని అన్నారు. భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు. పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు చేసి, జీఎస్టీ ద్వారా “వన్ నేషన్ వన్ ట్యాక్స్” లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. 2014లో 6.91 కోట్ల పన్నులు కట్టే వారు ఉండగా, ఇప్పుడు 15.66 కోట్లకు పెరిగిందని వివరించారు.

అలాగే మోడీ ప్రభుత్వం రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుపుతూ.. వ్యవసాయ బడ్జెట్ 25,633 కోట్ల నుంచి 1.33 లక్షల కోట్లకు పెరిగిందని, 82% వరకు గిట్టుబాటు ధరలు పెరిగినట్లు వెల్లడించారు. 11 కోట్ల మంది రైతులకు ” కిసాన్ సమ్మాన్ నిధి ” ద్వారా ఏటా నేరుగా రైతు అకౌంట్ లోకి నగదు అందిస్తామని అన్నారు. అలాగే ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అనుసరిస్తున్నామని చెప్పారు. పఠాన్ కోట్ సర్జికల్ స్ట్రైక్, పహల్గావ్ దాడి, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలు భారత్ శక్తిని చాటిచెప్పినట్టు పేర్కొన్నారు. బ్రహ్మోస్, బ్రహ్మాస్త్రం వంటి సామర్థ్యాలు దేశ రక్షణను మరింత బలంగా తీర్చిదిద్దాయని అన్నారు.

Read Also: Sonam Raghuwanshi: భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నా.. ప్రియుడికి మెసేజ్ పెట్టిన సోనమ్

మరోవైపు దేశంలో అమృత్ భారత్ పథకం కింద 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుండగా.. 1.46 లక్షల కి.మీ. జాతీయ రహదారులు, 7.7 లక్షల కిమీ గ్రామీణ రహదారులు నిర్మించామని చెప్పారు. రైల్వే బడ్జెట్ 29,056 కోట్ల నుంచి 2.42 లక్షల కోట్లకు పెరిగిందని, 136 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని వివరించారు. ఇక ఉడాన్ స్కీం ద్వారా సామాన్యులకూ విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చామని, 2014లో 71 విమానాశ్రయాలు ఉండగా.. ఇప్పుడు 159కి పెరిగినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 26 AIIMS ఆసుపత్రులు ఇప్పటికే పనిచేస్తుండగా, మరో 15 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.

బేటీ బచావో – బేటీ పఢావో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ విద్యుత్ యోజన, ఆర్టికల్ 370 రద్దు, 140 శాటిలైట్‌ల ప్రయోగం, చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరటం వంటి చర్యలు మోడీ ప్రభుత్వం సామాజికంగా, శాస్త్రీయంగా దేశాన్ని ముందుకు నడిపించిందని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. 2014లో లాభాల్లో ఉన్న రాష్ట్రం, మోడీ విధానాలను పాటించకపోవడంతో ఇప్పటికి 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version