NTV Telugu Site icon

Kishan Reddy : మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు

Kishan Reddy

Kishan Reddy

కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసీ పరిధిలో పర్యటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే సాక్ష్యమన్నారు. 30 ఏండ్ల కిందటే ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ట్యాక్సులు కూడా వసూలు చేస్తోందని, గత 30 ఏండ్ల కింద నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం ఏమాత్రం న్యాయం కాదు. దీనిపై సీఎం రేవంత్ మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్నారు కిషన్‌ రెడ్డి. పేద ప్రజల ఇండ్లు కూల్చడం ఏమాత్రం న్యాయం కాదని, అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయాలన్నారు కిషన్‌ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు ఒక్క ఇల్లు కట్టించలేదని, రెక్కాడితే గాని డొక్కాడనటువంటి వేలాది మంది ప్రజలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్.. ఎలా ఉన్నాయంటే..?

అంతేకాకుండా..’నిజాం హయాంలో మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి. అంతకంటే.. ముందు డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించేలా కార్యాచరణను రూపొందించాలి. ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేయాలి. పేదల గూడు కూలగొట్టి, సుందరీకరణ చేస్తామనడం ఎవరికోసం..? పేదల ఇండ్లు కూల్చే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలి. ప్రజల ఇండ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, రూ. 25 వేలు ఇస్తామంటూ చెబుతున్నాడు. దీనిని ప్రజలెవ్వరూ స్వాగతించట్లేదు. పేదల ఇండ్ల కూల్చాలనుకునే ముందు మమ్మల్ని జైలులో పెట్టి ఆ తర్వాత మీ కార్యాచరణ మొదలుపెట్టండి. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరికీ బిజెపి అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండాలని కోరుతున్నా. మూసీ సుందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చుతూ చేస్తున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 25వ తేదీన బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తాం. రండి.. కదలిరండి.. రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుదాం.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.

They Call Him OG: అలాంటోడు వచ్చి అలా నిలబడ్డాడు అంతే సార్!!

Show comments