NTV Telugu Site icon

Khalistani Terrorist: కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య.. భారత్‌లో పలు క్రిమినల్‌ కేసులు!

Khalistani Terrorist

Khalistani Terrorist

Khalistani Terrorist Sukha Duneke Killed In Canada Gang War: ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు పేర్కొన్నాయి. విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే మరణించినట్లు సమాచారం.

పంజాబ్‌లోని మోఘా జిల్లాలో దేవిందర్‌ బంబిహా గ్యాంగ్‌కు చెందిన సుఖా దునెకే.. 2017లో నకిలీ పత్రాలపై భారతదేశం నుంచి కెనడాకు పారిపోయాడు. దునెకేపై భారత్‌లో ఏడు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ అర్షదీప్‌ సింగ్‌ ముఠాలో దునెకే చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఖలిస్థానీ ఉద్యమంలో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. తెలుగోడికి ఛాన్స్! భారత తుది జట్టు ఇదే

పంజాబ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 29 మంది గ్యాంగ్‌స్టర్‌లు భారత్‌లో కేసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలకు పారిపోయారు. వీరందరూ నకిలీ ప్రయాణ పత్రాలతో లేదా దేశ సరిహద్దులు దాటి నేపాల్‌ మీదుగా పలు దేశాలకు వెళ్లి.. అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఈ హంతకులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలలో అగ్రగామిగా కెనడా ఉంది. 8 మంది కెనడాలో ఉన్నట్లు సమాచారం. ఈ ఎనమిది మందిలో ఒకడు సుఖా దునెకే. సుఖా బుధవారం జరిగిన కాల్పుల్లో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ మరియు రాజస్థాన్‌లలో దేవిందర్‌ బంబిహా గ్యాంగ్‌కు డునేకే నిధులు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. డునేకే దోపిడీలు చేయడమే కాకుండా సుపారీ తీసుకుని హత్యలు కూడా చేస్తాడు.