NTV Telugu Site icon

Nurse Nimisha Priya: యెమెన్‌లో నిమిష ప్రియకు మరణశిక్ష.. అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు

Nurse

Nurse

Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొన్నారు.

Also Read: Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?

2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో నిమిష ప్రియను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం ఆమెను దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయంపై నిమిష ప్రియ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినా, దాన్ని తిరస్కరించారు. చివరగా, యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ధృవీకరించడంతో నిమిష ప్రియ పరిస్థితి దారుణంగా తయారైంది. నిమిష ప్రియను శిక్ష నుంచి కాపాడే శక్తి ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే ఈ శిక్ష నుంచి ఆమె బయటపడగలదు. ఈ విషయాన్ని గ్రహించిన నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్‌కు వెళ్లి, అక్కడి గిరిజన నేతలను సంప్రదించి క్షమాభిక్ష కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయం ఆమె కృషిని వృథా చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.

Also Read: Parliament scuffle: ఆ రోజు రాహుల్‌ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. నిమిష కుటుంబ సభ్యులు ఆమెకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కలిచివేసింది. నిమిష ప్రియకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, యెమెన్ అధికారులను పలువురు కోరుతున్నారు.

Show comments