Keerthy Suresh: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది మన జీవితాలను సులభతరం చేస్తూనే, మరోవైపు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు సినీ నటీనటుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్య గురించే ప్రసిద్ధ నటి కీర్తి సురేష్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని బోల్డ్ ఫొటోలు చూసి తానే షాక్ అయ్యానని తెలిపింది. అవి తాను దిగిన ఫోటోలు కాకుండా, పూర్తిగా AI ద్వారా రూపొందించిన నకిలీ చిత్రాలని ఆమె స్పష్టం చేసింది. ఫోటోలు ఎంత నిజంగా కనిపిస్తున్నాయంటే, వాటిని చూసినప్పుడు నిజంగానే నేను ఇలా ఫోజులిచ్చానా? అని నేను నన్నే ప్రశ్నించుకున్నా అని తెలిపింది. ఈ నకిలీ ఫోటోలు తనను మానసికంగా తీవ్రంగా బాధించాయని, ఇలాంటి టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
READ MORE: Raja Singh: రాజమౌళి ప్రతి సినిమాను హిందువులు బ్యాన్ చేయాలి..
కేవలం తనకే కాదు, సోషల్ మీడియాలో ఉన్న ఏ వ్యక్తికైనా ఈ ముప్పు పొంచి ఉందని కీర్తి హెచ్చరించింది. ప్రస్తుతం నటీమణులు రష్మిక మందన్న, సమంత సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. AI టెక్నాలజీ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ దాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతోందని, ప్రజలను రక్షించేందుకు సరైన చట్టాలు అవసరమని కీర్తి స్పష్టం చేసింది. “రివాల్వర్ రీటా” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కీర్తి, తనకు సంబంధించిన తప్పుదారి పట్టించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు సైతం అయోమయానికి గురయ్యారని చెప్పింది. తాను సాధారణంగా ఎక్కువ గ్లామర్ చూపించని నటి అయినప్పటికీ, AI ద్వారా పూర్తిగా నకిలీగా రూపొందించిన బోల్డ్ ఫొటోలు విపరీతంగా చక్కర్లు కొట్టడం తాను భరించలేనిదిగా ఉందని వెల్లడించింది.