NTV Telugu Site icon

AP High Court: హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి.. ఏపీ హైకోర్టులో పిల్!

Hyderabad

Hyderabad

హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌ కుమార్‌ పిల్‌ను దాఖలు చేశారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగియనున్న విషయం తెలిసిందే.

ఏపీ విభజన చట్ట నిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ అమలుచేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని అనిల్‌ కుమార్‌ కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్‌, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శిని పిల్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్రప్రభుత్వం విఫలం కారణంగా.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందని అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Also Read: Madhyapradesh : 4 గంటలు ఐస్‌పై పడుకోబెట్టి, ముఖం పై మూత్రం పోసి, దారుణంగా కొట్టి.. ఎంపీలో దారుణం

రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నా.. అందుకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందని పొదిలి అనిల్‌ కుమార్‌ పిటిషన్లో తెలిపారు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే ఆస్తుల, అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. లేకపోతే ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. విభజన చట్ట నిబంధనలు అమలుకానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఏపీకి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పిటిషన్ వచ్చే బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.