నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు. “సిల్వర్ జూబ్లీ వేడుకలే ఇంపార్టెంట్. ఈ సీఎం ఇంతలా ప్రజల్లో వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. మనం ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ పోయాం. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. అదే అధికారులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చేయించుకోవడం రావడం లేదు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయి. మీరు సిద్ధంగా ఉండండి. మళ్లీ మనదే అధికారం.. మీరే ఎమ్మెల్యేలు అవుతారు.” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Anand Mahindra : టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడం పై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే ?
పార్టీ ప్రస్థానం.. కష్ట నష్టాలు వివరించి కార్యకర్తలు నాయకుల్లో మనో ధైర్యాన్ని పెంచారు. టీడీపీ ఎన్టీఆర్ నాటి పరిస్థితుల నుంచి అన్ని అంశాలను వివరించారు. “తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా ప్రసవించిన బిడ్డ టీఆర్ఎస్. తెలంగాణ రాజకీయ అస్తిత్వం, రాష్ట్రాన్ని సాధించి చారిత్రక బాధ్యతను నిర్వహించిన ప్రజల పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాల నుంచి కోలుకున్న రాష్ట్రాన్ని తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి. పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలి.” అని మాజీ సీఎం పిలుపునిచ్చారు.
READ MORE: Heart attack: లాయరన్న జరభద్రం.. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో మరో అడ్వకేట్ మృతి..