NTV Telugu Site icon

Delhi excise policy case: కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు

Mlc Kavitha

Mlc Kavitha

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లింమెంటరీ చార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కవితను ఈ సారి ఈడీ అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్‌గా విచారణకు హాజరుపరిచారు.

READ MORE: T20 World Cup 2024: టీ20 ప్రపంచ‌క‌ప్‌కు హార్దిక్‌ను వద్దన్న రోహిత్‌.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. అదేవిధంగా, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.