Site icon NTV Telugu

Honour Killing: మరో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. మనస్తాపంతో ప్రేమికుడు సూసైడ్

Karnataka

Karnataka

Honour Killing: ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలు చేయడం చూస్తున్నాం. తాము చేసిన తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఓ తండ్రి అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురుని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కేజీఎఫ్‌లో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లోని బంగారుపేట నివాసి కృష్ణమూర్తి కీర్తి అనే 20 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె వేరే కులానికి చెందిన 24 ఏళ్ల గంగాధర్‌ను ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. ఈ విషయం తన తండ్రికి చెప్పి ఒప్పించి తన ప్రియుడితో ఒక్కటవ్వాలనుకుంది. దీనికి కృష్ణమూర్తి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో తండ్రి కూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం ఉదయం కృష్ణమూర్తి గంగాధర్‌తో ఉన్న సంబంధాన్ని విడనాడాలని కీర్తిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. దీంతో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కృష్ణమూర్తి కీర్తిని గొంతుకోసి చంపేశాడు. ఆపై హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరివేశాడు.

Also Read: Heavy Rains Warning: రానున్న రోజుల్లో భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ

ప్రియురాలి మరణ విషయం తెలుసుకున్న ప్రియుడు గంగాధర్‌ మనస్తాపం చెందాడు. తన ప్రియురాలి వద్దకు వెళ్లిపోవాలని నిశ్చయించుకుని ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా.. పోలీసులు కృష్ణమూర్తి ఇంటికి చేరుకుని కీర్తి మృతదేహాన్ని పరిశీలించారు. కీర్తి హత్యకు గురైందని అనుమానించి కృష్ణమూర్తిని విచారించడం ప్రారంభించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్ కీర్తి మృతి విషయం తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నకూతురిని హత్య చేసిన కృష్ణమూర్తి అరెస్ట్ చేసినట్లు కేజీఎఫ్ ఎస్పీ ధరణి దేవి తెలిపారు.

Exit mobile version